స్వపరిచయం:
అయోధ్యారెడ్డి (ఎగుమామిడి అయోధ్యారెడ్డి) తెలంగాణ నడిబొడ్డున సిద్ధిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో11 ఫిబ్రవరి 1955న జన్మించారు. సిద్దిపేటలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తర్వాత పొలిటికల్ సైన్సులో మాస్టర్ డిగ్రీ,
తర్వాత పిహెచ్.డి చేశారు. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.1983లో పాత్రికేయ రంగంలో ప్రవేశించి ‘ఉదయం’ దినపత్రికలో సబ్ ఎడిటరుగా మొదలైన జర్నలిజం ప్రయాణం, తర్వాత దాదాపు
మూడున్నర దశాబ్దాలు కొనసాగి దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీ విరమణ చేశారు.
ప్రవృత్తి రీత్యా పుస్తక పఠనం పట్ల ప్రాణంగా ఉన్నారు. పాఠనాభిలాష తనకు ఆకలికంటే తీవ్రమైందని చెప్పుకునే ఆయన
స్కూలు రోజుల్నుంచీ సాహిత్యం (ప్రత్యేకించి కథలు, నవలలు) విస్తృతంగా చదువుకున్నారు.
కథలు:
తెలుగు వచనం, ముఖ్యంగా ప్రపంచ సాహిత్యం ఎక్కువ చదివారు, చదువుతారు. కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి వ్యామోహంగా కథలు
రాశారు. కథ పుట్టేందుకు జీవితం నెలవైతే, జీవితాన్ని చేరుకునేందుకు కథ ఒక బాట అని నమ్ముతూ కథా సృజన చేస్తున్నారు.
ఆయన తొలికథ “మృత్యువులో వ్యత్యాసం” 1974 లో గులాబి మాసపత్రికలో అచ్చయింది.
అక్కణ్ణుంచి మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా రెగ్యులరుగా రాస్తున్నారు. ఇప్పటివరకు 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 50 వరకు వివిధ దేశాలకు చెందిన కథలను, ఒక ఆఫ్రికన్ నవలను అనువదించారు.
ప్రచురించబడిన అయోధ్యారెడ్డి గ్రంథాలు:
1985లో “సమకాలీన రాజకీయాలు – తెలుగు సాహిత్యం” వ్యాస గ్రంథం
2017లో తొలి కథల సంపుటి “ఆహారయాత్ర”
2018లో ప్రసిద్ధ ఆఫ్రికన్ నవల “వీప్ నాట్ ఛైల్డ్” కు అనువాదం “ఏడవకు బిడ్డా”
2020లో రెండవ కథా సంపుటం “అక్కన్నపేట రైల్వేస్టేషన్”
2022లో ప్రపంచ దిగ్గజ రచయితల ఇరవై క్లాసిక్ కథల అనువాద సంపుటి “కథాసంగమం”
2023లో అరబిక్ దేశాలకు చెందిన 20 ఉత్తమ కథల అనువాద సంపుటి “అరబ్ షాట్స్”
2023లో మూడో కథల సంపుటి “సీతంబాయి పొలం”
సాహిత్యంలో సాధించిన గొప్ప విజయాలు, మైలురాళ్ళు ఏమీ లేవని భావిస్తారు.
ఒకప్పటి ప్రసిద్ధ పత్రికలైన భారతి, యువ, స్రవంతి, ప్రగతి, ప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి వారపత్రికల నుంచి నేటి అన్ని దిన, వార, మాస, వెబ్ పత్రికల్లో ఎన్నో కథలు, అనువాదాలు ప్రచురితమయ్యాయి.
ఇవేకాకుండా పలు పత్రికలకు, ఆలిండియా రేడియో కోసం సాహిత్య విమర్శలు, వాణిజ్య, క్రీడారంగ వ్యాసాలు రాశారు.
1975 నుంచి ఇప్పటివరకు చాలా కథలకు పత్రికల నుంచి బహుమతులు పొందారు. పలు సాహిత్య సభల్లో వక్తగా పాల్గొన్నారు. రచయితల కార్యశాలల్లో పాల్గొని కొత్త, వర్ధమాన రచయితలకు కథలు రాయడంలో మెళుకువల గురించి బోధించారు.
ఆయన తమ సాహిత్య ప్రస్థానంలో నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు, సాహితీగౌతమి అవార్డు, పాకాల యశోదారెడ్డి, మాడభూషి రంగాచార్య, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ తదితర వివిధ పురస్కారాలు అందుకున్నారు. పలు కథల పోటీలు, వార్షిక పురస్కారాలకు సంబంధించి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ముల్కనూరు గ్రంథాలయం – నమస్తే తెలంగాణ నిర్వహిస్తున్న కథలపోటీకి 2020లో ఒక పర్యాయం న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీ – 2021లో “సీతంబాయి పొలం” అనే ఆయన కథకు విశిష్ట పురస్కారం, 2022 పోటీలో “పితరులు” కథకు ₹3,000 బహుమతి లభించాయి.