Competition-2022

కథల పోటీ - 2022

సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యం, వైరుధ్యాల నేపథ్యంలో కథ ఉండాలని; నవ్యతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే కథలకు మాత్రమే ఆహ్వానం పలుకుతూ 2022 అక్టోబర్ 23న కథల పోటీ ప్రకటన వెలువడింది. కథలు పంపడానికి ఆఖరు తేదీని మొదట నవంబరు 23గా ప్రకటించినప్పటికీ తుది గడువు డిసెంబర్ 5 వరకు పొడిగించబడింది. దాదాపు 500 కథలు వచ్చినాయి. 

ఫలితాలు 2023 మార్చి 28న ప్రకటించినారు. కథల ప్రచురణ 2023 జూన్ 18 నుంచి మొదలైంది.

బహుమతి ప్రదాన సభ 2023 జూలై 9న హైదరాబాదులో జరిగింది:

– మధ్యాహ్నం 12:00 నుంచి రవీంద్రభారతిలో అతిథులకు ఆహ్వానం, 1:00 నుంచి 2:00 వరకు భోజనాలు, 2:00 నుంచి 5:00 వరకు రచయితల ఇష్టాగోష్ఠి;

– సాయంత్రం 5:30 నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బహుమతుల ప్రదానం జరిగినాయి. రవీంద్రభారతిలో రచయితల ఇష్టాగోష్ఠి తర్వాత వేముల శ్రీనివాసులు గారు దారితీయగా రచయితలందరూ కలిసి ఒక పాదయాత్రగా అసెంబ్లీ మెయిన్ గేటు ముందు నుంచి సాగి పబ్లిక్ గార్డెన్స్ చేరుకున్నారు.

చెణుకు
“జనసభ ఒకటి, భోజన సభ ఒకటి. చాయ్ నిజామ్ క్లబ్బులో పోయించండి సార్ :-)!”
_ కరణం జనార్ధన్
* నమస్తే తెలంగాణ 'జిందగీ' ఫీచర్స్ ఇన్‌చార్జ్

సభ విశేషాలు:

ఇవటూరి రాజమోహన్ (2021 పోటీల్లో ప్రత్యేక బహుమతి విజేత)

నమస్తే తెలంగాణా, ముల్కనూరు ప్రజా గ్రంధాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ విజేతలకు జులై తొమ్మిదవ తేదీన బహుమతుల ప్రదానం జరిగింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పోటీలో విజేతలందరినీ ఒక చోటకు చేర్చి కొన్ని గంటల సేపు ఆ రచయితల మధ్య ఇష్టా గోష్ఠిని నిర్వహించిన తర్వాత బహుమతి ప్రదానం చేయడం రచయితలందరికీ ఎంతో సంతోషకరం గా అనిపించింది. ఇంత మంది రచయితలతో ఇంత సేపు సాంగత్యం ఎంతమందికి లభిస్తుంది?

రచయితలు తమ కథల గురించి మాత్రమే కాక కొన్ని సూచనలు, కొన్ని అనుభవాలు పంచుకున్నారు.

నాకు గుర్తున్న కొన్ని విషయాలని ఇక్కడ పంచుకుంటున్నాను.

పోటీలకు కథల నిడివి అనే పరిధి రచయితల స్వేచ్ఛని కొంతవరకూ హరిస్తోందని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ నిడివి అనే హద్దులో రాసే ప్రయత్నంలో కథ యొక్క ముఖ్యమైన ఇతివృత్తం సరిగ్గా వివరించలేకపోతున్నామని వారు చెప్పారు. నిక్కచ్చిగా హద్దులు గీయకుండా కొంత వరకూ పరిధిని దాటేలా ఈ నియమాన్ని సడలించమని వారిలో కొందరు సూచించారు. ఉదాహరణకి కథ నిడివి మూడు వేల పదాలు దాటకూడదనే నియమాన్ని సడలించి మూడు వేల నుంచి మూడు వేల అయిదు వందల మధ్యలో ఎంతైనా నిడివి ఉండచ్చు అని ప్రకటించవచ్చు అని వారి అభిప్రాయం.

యువ రచయితల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించమని కొందరు కోరారు. బహుశా ఎన్నో ఏళ్ళ నుంచి రాస్తున్న లబ్ద ప్రతిష్టుల నుంచి పోటీ లేకుండా యువతరం మరింత స్వేచ్ఛగా పోటీలో పాల్గొనవచ్చు అని అభిప్రాయం కావచ్చు. యువ రచయితలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ విధమైన పోటీలు యువతలో ఉత్సాహాన్ని కల్పిస్తుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు.

పురస్కారం పొందిన కథలు గంభీరమైన అంశాలతోనే ఉన్నాయనీ వినోదం పాలు లేదని ఒక రచయిత అన్నారు. నవరసాలలో ఒకటైన హాస్యాన్ని విస్మరించి రాస్తేనే పోటీలో గెలవచ్చనే అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని వారు సూచించారు.

కథలలో అంశాలు చాలా మూసగా ఉన్నాయనీ ఈ నుయ్యిలోంచి బైటికి రావాలని మరొక రచయిత సూచిస్తే నిర్వాహకులతో పాటు ఎంతో మంది అంగీకరించారు. ఒక రచయిత మూస నుంచి బైటికి వచ్చే కొన్ని అంశాలని ప్రస్తావించారు. రైతు సమస్యలు, ధనికులు – బీదలు, కుల వివక్ష, స్త్రీలని అణగదొక్కటం వంటి అంశాలలో ఎక్కువ కథలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఇంకా ఉన్నాయి కనుక తప్పకుండా ఆ అంశాలు ఉండాలి. కానీ కొత్తగా తలెత్తుతున్న ఎన్నో సవాళ్ళని కూడా గమనించాలి.

ఈ తరం తలిదండ్రులకు వారి పిల్లల గురించి మూడు ముక్కలు కూడా చెప్పలేనంత నిర్లిప్తమైన జీవితం జీవిస్తున్నారనీ, అలాగే తమ తలిదండ్రుల గురించి ఏమీ తెలియకుండా పిల్లలు బతుకుతున్నారనీ అటువంటి అంశం ఈ తరం సమస్యలలో ఒకటి అన్నారు. అలాగే స్వలింగ జీవనం అనేది న్యాయపరంగా సమ్మతమై పదేళ్లకు పైగా గడిచినా ఇంకా వారు సంఘంలో నిర్భయంగా జీవించే పరిస్థితి లేదు. ఇది కూడా ఒక మంచి అంశంగా కథలు రావచ్చు.

న్యాయ నిర్ణేతలలో ఒకరు మంచి కథలు రాయాలంటే సాధన చేయాలని, ఈ సందర్భాల్లో సాధన అంటే చదవటం అన్నారు. ఒక రచయిత కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. రచయితలని గుడ్డిగా అనుకరించ వలసిన అవసరం లేకపోయినా రకరకాల శైలులను గమనిస్తే మన రచనా శక్తి పెరుగుతుంది. కేశవరెడ్డి గారు ప్రతి నవలని ఒక దినం ప్రారంభంతో మొదలు పెట్టి ఆ రోజు ముగిసేలోపు కథని ముగిస్తారు. ఇది ఒక అద్భుతమైన శైలి. అందుకే ఆయన నవలలు చదివే వారు మొదలు పెట్టాక ఆఖరు పుట వరకూ ఒకే ఊపులో చదివేస్తారు. రెండు మూడు పుటలలో అద్భుతమైన కథలు రాసిన శంకరమంచి సత్యం గారిది మరో శైలి. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు చిన్న కథలతో గుండెలు పిండేస్తారు. అయితే వీరిద్దరూ కూడా సమాజాన్ని గానీ ఒక వర్గాన్ని గానీ నిందించరు. ఒక వాస్తవికతని మన ముందు ఉంచటమే వారి పని. రావి శాస్త్రి గారు, కుటుంబరావు గారు పెద్ద కథల కి పెట్టిన పేర్లు. కథని చక్కటి మలుపుతో కొసమెరుపులతో ముగించే నైపుణ్యం ఓ హెన్రీ గారి సొంతం. ఇలా ఎందరివో రచనలు చదివితే మన అవగాహన పెరుగుతుంది.

కథల నిడివి గురించి కూడా ఒక రచయిత శంకరమంచి, నామిని గారు వంటి రచయితలని ఉదహరిస్తూ చిన్న కథలు రాయటం కూడా ఒక శైలి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయమేమిటంటే ఒక పోటీకి నియమాలు తప్పదు. కథల పోటీ మాత్రమే కాదు. ఏ నియమం లేకుండా జరిగే ఏ పోటీ అయినా వివాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువ. ఎక్కువ మంది అభిప్రాయాలననుసరించి చిన్న చిన్న సవరణలు చేయవచ్చు. పెద్ద కథలని ప్రోత్సహిస్తూ ఒక పెద్ద రచయిత పెద్ద కథల పోటీని ప్రకటించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

న్యాయ నిర్ణేతలు కూడా వారి అనుభవాలని పంచుకున్నపుడు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. కథా గమనం ఒకే తరహాలో నడవాలి. ఒకసారి ఒక మాండలికం, మరో చోట వేరే మాండలికం ఉపయోగించటం వంటివి మంచి కథలో కూడా పంటి కింద రాళ్ళలా తగులుతాయి. మరొక విషయం ఏమిటంటే పాఠకుల హృదయాన్ని తాకేదే గొప్ప కథ అని అన్నారు. ప్రథమ బహుమతి పొందిన కథకీ చివరి బహుమతి పొందిన కథకీ మధ్య అంతరం చాలా తక్కువే అనీ, అన్నీ గొప్ప కథలే అని చెప్పారు.

బహుమతి ప్రదానానికి ముందు ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారిని సన్మానించటం అందరినీ సంతోషపెట్టింది. తన తండ్రి గారి గురించి ఆయన పుత్రుడు భావోద్వేగంతో చదివిన కవిత ఎంతో బాగుంది. కవి గారి కుటుంబానికి ఆర్ధిక సాయం చేయటం నిర్వాహకుల సహృదయత.

ఆరేడు గంటల ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది.

 

న్యాయ నిర్ణేతలు:

కోడూరి విజయకుమార్, దేవరాజు విష్ణు వర్ధన్ రాజు, ఆర్. శశిధరాచారి, గింజల మధుసూదన్ రెడ్డి,
శశికిరణాచారి, శ్రీనివాస్ కాకర

కథల పోటీ - 2022 ఫలితాలు:

స్పాన్సరర్స్:

రామకృష్ణారావు (CREDAI అధ్యక్షులు), ఆదిత్య గౌర, మురళీ మోహన్, వేణు వినోద్