Duddumpudi-Anasuya

స్వపరిచయం:

‘మళ్లీ రెక్కలొచ్చిన పక్షులు’ రచయిత్రి దుద్దుంపూడి అనసూయ

 

 

రాజమండ్రి పరిసర ప్రాంతమైన ములకల్లంక గ్రామంలో ముసునూరి రామారావు – రత్నాంబలకు తొమ్మిదో సంతానంగా 1-5-1967 తేదీన జన్మించినా బాల్యం పదవ తరగతి వరకూ భద్రాచలం పరిసర ప్రాంతంలోనే గడిచింది. అప్పుడే అక్క గారైన జాస్తి రమాదేవి ప్రోత్సాహంతో కొన్ని కవితలు వ్రాసి పంపితే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయినాయి. వివాహానంతరం సామర్లకోట కోడలిగా వెళ్లి అత్తగారు సరోజినీ గారి సహకారంతో ఆగిపోయిన చదువు కొనసాగించి డిగ్రీ పూర్తయ్యాక విద్యా బోధనపై ఆసక్తితో, ఉన్న వారికే కానీ పేద పిల్లలకు అందని ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి, నామ మాత్రపు ఫీజుతో ఊరిలో మంచి పేరు సంపాదించుకుని, చేతనైన సేవ చేస్తున్న అనుభూతే కాకుండా ఫలానా వారి కూతురనో, కోడలనో కాకుండా స్వంత గుర్తింపుతో జీవన గమనం సాగిపోతుండగా కరోనా బీభత్సం వల్ల సేవ ఆగిపోయి నిస్సారంగా గడుస్తున్న సమయాన చిన్న నాటి సాహిత్యాభిలాష మేల్కొనగా కథలు వ్రాస్తుంటే ఆన్లైన్ పత్రికలు బహుమతులిచ్చి ప్రోత్సాహ పరుస్తుంటే ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారు రచయిత్రిగా మరింత నమ్మకాన్ని, గుర్తింపునిచ్చి జీవితం సఫలం చేసారు. ఎన్నో మజలీలనంతరం, ఏకైక కుమార్తె మంచి స్థాయిలో ఉందన్న సంతృప్తితో రాజమండ్రి లో స్థర నివాసిగా నిత్య విద్యార్థిగా గోదావరి గలగలలతో స్నేహం చేస్తూ భర్త చంద్ర శేఖర్ తో ఆఖరి మజిలీ వరకూ శ్వాసించాలని…