సంక్షిప్తంగా:
ప్రతిఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. తనకు మాత్రం.. తల్లి తాహేరాబేగం రోల్ మోడల్ అంటారు సంఘీర్. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా హుమాయున్ సంఘీర్ సుపరిచితులు.
కామారెడ్డి (ఉమ్మడి నిజామాబాద్) జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్‌పేట్ స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రచయితగా ఇప్పటివరకు 35కు పైగా కథలు రాశారు. పలు పత్రికల కోసం కవితలు, వ్యాసాలు, పజిల్స్ రాశారు.
‘కామునికంత’ వీరి తొలి కథల సంపుటి.
రెండో కథల సంపుటి, పొలిటికల్ & జనరల్ సెటైర్స్ ‘గెంటీలు’ ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
సినిమారంగంలోనూ సహ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. కొన్నిటికి దర్శకత్వం వహించారు. నటుడిగా ‘మూలుగుబొక్క’ వెబ్ సిరీస్, ‘దొరసాని’ చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ, మాటలు అందిస్తున్నారు.
సవివరంగా:
పేరు: హుమాయున్ సంఘీర్
స్వస్థలం: గోపాల్ పేట్ గ్రామం, నాగిరెడ్డిపేట్ మండలం, కామారెడ్డి జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
పుట్టిన తేదీ: 11-04-1982
తల్లిదండ్రులు: ఖయ్యుం, తాహేరాబేగం, చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లియే కూలీనాలీ పనులు చేసి పిల్లలను పోషించింది.
ఇతరాలు:
కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించారు.
దర్శకత్వ విభాగంలో పలు సినిమాలకు, సీరియళ్ళకు పనిచేశారు.
పలు వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో (మూలుగుబొక్క, ఏం బతుకురా నీది, తంగేడుపూలు, ఆడబిడ్డ, ఓరివారి, రైతుగోస, ఇంటిగోస) నటించారు, దర్శకత్వం వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖావారి ‘కోలాటం’ అనే డాక్యుమెంటరీ చేశారు.
‘దొరసాని’ సినిమాలో కామ్రేడ్ యాదగిరిగా నటించారు.
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.
కథలు సిద్ధం చేసుకున్నారు.
పూర్తిస్థాయి సినిమా దర్శకుడిగా రాణించాలి అనుకుంటున్నారు.
శుభోదయ, 6టీవీ, వీ6, మైక్ టీవీ, మైక్ టీవీ, న్యూస్ నౌ తెలుగు, హెచ్ఎం టీవీ, కలగూర గంప వంటి టీవీ, యూట్యూబ్ ఛానెళ్లలో పనిచేశారు. ‘శ్రావ్య’ వార పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.
సాహిత్యంతో అనుబంధం:
అప్పుడప్పుడు కవిత, వ్యాసం, పజిల్స్, పిల్లల కథలు, ఇంకొన్ని సినిమా రివ్యూలు. అలా కథల వరకు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. 2006లో ఆంధ్రభూమి పత్రికలో ‘ఎటుపాయె’ అనే కవిత ఫస్ట్ టైం అచ్చయింది. అదిచ్చిన కిక్కుతో అక్షరం వేలు పట్టుకొని వదలొద్దని అనుకున్నారు.
చదవడానికి, రాయడానికి బ్రేక్ ఇవ్వడం తనకు నచ్చదు అంటారు. 2008లో మొదటి కథ ‘శ్రేయోభిలాషి’ చెన్నై నుంచి వచ్చే ‘స్వప్న’ మాస పత్రికలో అచ్చయింది. ఇక అప్పుడే నిర్ణయించుకున్నారు కథలే రాయాలని. తను చూసిన జీవితాలను కథలుగా మలచాలని. అక్షరాల్లో మట్టి పరిమళాలు వెదఝల్లాలని భావించారు.
ఆంధ్రప్రభలో రాసిన ‘పవిత్రం’ కథ హిందీలోకి తర్జుమా అయింది. విపులలో రాసిన ‘పంచుకునే మనసుంటేనే’, తెలుగు వెలుగులో ‘సారకుక్క’, నమస్తే తెలంగాణ బతుకమ్మలో వచ్చిన ‘తోడు బతుకమ్మ’ కథలు మంచి పాఠకాదరణ పొందాయి. వట్టికోట అళ్యారుస్వామి సిద్దిపేట కథలపోటీ 2014లో రాసిన కథ ‘భూదెవ్వ’కు ఉత్తమ కథ బహుమతి లభించింది.
నోముల సత్యనారాయణ కథలపోటీ 2016లో ‘కడసూపు’ కథకు ఉత్తమ కథ పురస్కారం లభించింది.
అమెరికా వారి ‘లెట్స్ ఫిలిం తెలంగాణ’ వాట్సాప్ గ్రూప్ వారు నిర్వహించిన కథల పోటీ 2016లో ‘చిమ్నీ’ కథకు మొదటి బహుమతి లభించింది. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం నిర్వహించిన కథలపోటీ 2019లో ‘హరామ్’ కథకు ద్వితీయ బహుమతి వచ్చింది.
అవే పోటీలు 2021లో ‘కామునికంత’ కథకు కన్సొలేషన్ బహుమతి వచ్చింది. తర్వాత నిర్వహించిన ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ కథలపోటీ 2022 లో ‘ఇబ్లీస్’ కథకు మొదటి బహుమతి వచ్చింది.
అలా ఇప్పటివరకు 35 కథల వరకు రాశారు.
వాటిలో 15 కథలతో ‘కామునికంత’ కథా సంపుటి తీసుకువచ్చారు. 15 కథలతో ఇంకొక పుస్తకం తయారీలో ఉంది.
‘గెంటీలు’ పేరుతో ఫేస్‌బుక్‌లో రాస్తున్న మ్యూజింగ్స్‌కు మంచి పేరు వచ్చింది. వాటిని త్వరలోనే ఒక పుస్తకంగా తేవాలి అనుకుంటున్నారు.