స్వపరిచయం:
సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, ఈ రోజు ఒక ప్రముఖ పత్రిక ద్వారా మీకు పరిచయమవుతున్నానంటే, ఆ గొప్పంతా నేను పుట్టి పెరిగిన వాతావరణానికీ, నన్ను పెంచి పెద్ద చేసిన పెద్దవాళ్లకీ దక్కుతుంది.
నేను స్కూల్లో ఉండగానే కథలు రాయడం ప్రారంభించినా అసలు పత్రికలకి పంపాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఊరికే రాసేసి పక్కన పెట్టేసేదాన్ని అంతే.
ఇంటర్మీడియట్‌లోనూ, డిగ్రీలోనూ కాలేజీ మేగజైన్‌లో రాశాను. బిఏ పాసై ఖాళీగా ఉన్న తర్వాత, తొలిసారిగా ఒక కథ రాసి చందమామకు పంపాను.
అది ఏ సంవత్సరంలోనో గుర్తు లేదు. రికార్డుల్లో ఉన్న మేరకు జూన్ 1983లో నా తొలి కథ (“స్వార్థ పండితుడు”) చందమామలో పడింది. అక్కడి నుంచి ఇంచుమించు చందమామ ఆగిపోయేదాకా అందులో రాశాను.
“లక్ష్మీగాయత్రి” అన్న నా పేరుతోనూ, మా అమ్మాయిలు “లలిత” “శర్మిల” పేర్లతోనూ (లలిత-శర్మిల) చందమామలో వందకు పైగా కథలు, మూడు చిన్న ధారావాహికలు, ఒక పెద్ద సీరియల్ ప్రచురించబడ్డాయి.
నా పెద్ద సీరియల్ పేరు “స్వర్ణ సింహాసనం”! కథలో కథ టెక్నిక్ నాకు చాలా ఇష్టం.
కాశీ మజిలీ కథలు ఆ రకంగానే ఉంటాయి. అదే విధంగా రాయాలన్న కోరికతో స్వర్ణసింహాసనం రాశాను.
2003 నుంచి 2015 వరకూ పుష్కరకాలం వైజాగ్‌లోనే లోకల్ పేపర్‌లో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగం కూడా చేశాను. నిత్యం ఎడిటోరియల్ రాసేదాన్ని. అదిగాక ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి వార్తలు తర్జుమా చేసి రాస్తూ గడిపాను.
2015లో ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగానే విరమించుకున్నాను. మావారు సాంబశివరావుగారు కేంద్రీయవిద్యాలయలో టీచర్‌గా పనిచేసి రిటైరయిపోయారు.
చందమామ ఆగిపోయిన తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు అక్షరసన్యాసంలో గడిపాను. మళ్లీ 2020-21 నుంచీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.
ఇప్పటి పరిస్థితే వేరు. ప్రింట్ పత్రికలు దాదాపుగా మాయమైపోయాయి. సాహిత్యం ఆన్‌లైన్‌లో స్థిరపడుతోంది. భగవంతుని దయ వల్ల నా ఉద్యోగ జీవితం నాకు ఇంటర్నెట్‌తో సాన్నిహిత్యాన్ని, తెలుగు టైపింగ్‌ని బాగా నేర్పింది. అంచేత తెలుగులో టైప్ చేయడం, కథలు మెయిల్ చెయ్యడం నాకు కష్టం కాలేదు.
2021లో లేఖిని – కథావేదిక (టొరంటో, కెనడా) సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. అలాగే ఈ ఏడాది విశాఖ సాహితి వారి పోటీల్లో కూడా ప్రథమ బహుమతి వచ్చింది. ఇవిగాక కథామంజరి, కౌముది, నమస్తే తెలంగాణ బతుకమ్మ, పాలపిట్ట, విశాలాక్షి కథల పోటీల్లో కూడా బహుమతులు వచ్చాయి.
తాజాగా స్వాతి సపరివారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీలో నా కథ “పిగ్మాలియన్” బహుమతి గెలుచుకుంది. సహరి వారు కొసమెరుపు కథకి బహుమతి ఇచ్చారు.
ఈనాడు హాయ్ బుజ్జీలో బాలల కథలు, ఆదివారం అనుబంధంలో మామూలు కథలు వస్తున్నాయి. సహరి వారపత్రికలో “కమ్మని కాపురం”, “చూడు చూడు అమెరికా” కథలు వచ్చాయి.
కథారచన విషయానికొస్తే…నాకెంతో ఇష్టమైన ఒక మాట చెప్పి విరమిస్తాను. ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలతను ఒకసారి ఎవరో “మీరు రాసిన ఫలానా నవల చాలా బావుంది” అంటూ పొగిడారట. అప్పుడామె, “కథల్ని స్వయంగా ఆ సరస్వతీదేవే రాసి, గొప్పతనాన్ని మాత్రం రచయితలకి అంటగడుతుంది!” అని చెప్పారట.
కళాప్రపూర్ణ బిరుదునందుకున్న ఆ మహనీయురాలే అంత మాట అన్నప్పుడు ఇక సముద్రపు ఒడ్డున ఇసుకరేణువులాంటి నేనెంత…నా కథలెంత?!
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!!
శుభమ్!!!!