Prabhaker Rao

సంక్షిప్తంగా:

మనసు స్పందించినప్పుడే కలం పట్టినా, పాఠకుల హృదయాలను కదిలించే కథలు రాస్తున్నారు ..

అత్రిపత్రి ధర్మశాంతి ప్రభాకర్ రావు.

సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామం వీరి స్వస్థలం. తల్లి శాంతమ్మ ప్రోత్సాహంతో చిన్నతనంలోనే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్నారు.

తండ్రి ధర్మయ్య ఉద్యోగరీత్యా బాల్యం అనేక గ్రామాల్లో గడిచింది. అప్పటినుంచే గ్రామీణ జీవన విధానాలు, సంస్కృతి, మాండలికాలను గమనిస్తూ ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (మెకాన్‌ లిమిటెడ్‌)లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి, విరమణ పొందారు.

విద్యార్థి దశ నుంచే కవితలు, వ్యాసాలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1975లో ‘రంగీ – రంగడు’ నవల రాశారు. బలియాగం, దిష్టిబొమ్మ, రెజాలు కథలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.

ముంబైకి ఎక్కువగా వలస వెళ్లే తమ గ్రామ యువతను ప్రేరణగా తీసుకొనే ‘వలస కలలు’ కథ రాశానని చెబుతున్నారు రచయిత.

సవివరంగా ఆయన మాటల్లోనే:

కథాప్రపంచంలో నేను ‘అనామ’కుణ్ణి. నా తొలి అక్షర బీజ గురువు నా తల్లి శాంతమ్మ. విస్తృతమైన పుస్తక పఠనకు అమ్మే నా రోల్ మోడల్. నా తండ్రి ధర్మయ్య నా పయనానికి మార్గదర్శి. నా తండ్రి, తల్లి అనేక గ్రామాల్లో పనిచేయటం మూలంగా గ్రామీణ జీవన విధానాలను, సంస్కృతిని, భాషా మాండలికాల్ని గమనించేవాణ్ణి. చదువులు హైదరాబాదులో, సెలవులు గ్రామాల్లో జరిగేవి.

 

నా పూర్తిపేరు అత్రిపత్రి ధర్మశాంతి ప్రభాకరరావు. వయసు 73 ఏండ్లు. పుట్టింది  కరీంనగర్, పెరిగింది అనేక ఊళ్ళలో. స్వగ్రామం చందుర్తి (సిరిసిల్ల జిల్లా). విద్యార్హతలు B Tech, MBA, PGDCS, MIE. ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ సంస్థ మెకాన్ లిమిటెడ్ లో జనరల్ మేనేజర్  (స్టీల్ ప్లాంట్స్, కెమికల్ ప్లాంట్స్, డిఫెన్స్ ప్లాంట్స్ డిజైనర్ ఇంజనీర్) గా పదవీ విరమణ. International Consultant for Import of Metallurgical Coke from China to India.

 

స్కూల్, కాలేజీల్లో ఉన్నప్పటి నుండే కవితలు, వ్యాసాలు, చిన్న కథలు మ్యాగజీన్స్ కి వ్రాయడం, నాటకాల్లో వేయడం, దర్శకత్వం చేయడం జరిగింది. 1970 దశకంలో “కళావాణి” అనే సాంస్కృతిక సంస్థ సభ్యునిగా రేడియో కదంబ కార్యక్రమాల్లో, సాహిత్య గోష్ఠులలో, కవి సమ్మేళనాలలో, నాటక ప్రదర్శనలో పాల్గొనటం జరిగింది. 2010 తర్వాత నా తండ్రి రాసిన నాటకాల్లో కొన్నింటిని 40 మంది కళాకారులతో రెండున్నర గంటల నిడివితో నా దర్శకత్వంలో రామ్ కోటి, హైదరాబాదులో చేయడం జరుగుతూ ఉంది. రచన నాకు వ్యాసంగం కాదు. అడపాదడపా వ్రాస్తుంటాను.

 

ప్రచురిత రచనలు: ప్రత్యేక తెలంగాణ సాధన మలి ఉద్యమ కాలంలో నమస్తే తెలంగాణ – బతుకమ్మలో “బలియాగం”, “దిష్టిబొమ్మ” కథలు ప్రచురించబడ్డాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంతో విశాఖ జిల్లా మండలిక భాషలో వ్రాసిన “రెజాలు” అనే కథకు నవతెలంగాణ దినపత్రిక నిర్వహించిన కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది.

“వలస కలలు” కథ: 1998లో బీహారులోని బొకారో స్టీల్ ప్లాంట్ కమీషనింగ్ చేస్తున్న సమయంలో రాత్రులలో నిద్ర రాకుండా ఉండడానికి ఈ కథను అంచెలంచెలుగా రాయటం జరిగింది. దీనికి నేపథ్యం మా ఊళ్లోని యువత జీవనోపాధి కోసం తరచుగా బొంబాయికి వలస వెళ్లేవాళ్లు. అది నా కథకు ప్రేరణ అయింది.

 

అప్రచురిత రచనలు: 1975లో మొత్తం ఆనాటి గ్రామీణ తెలంగాణ మాండలిక భాషలోనే వ్రాసిన “రంగీ – రంగడు” నవల.

2010-2014 మధ్య కాలంలో “మూడవ కన్ను” (హిందూ – మొసపొటేమియా – బైబిలు చుట్టరికం) అనే పరిశోధనా గ్రంథం వ్రాయటం జరిగింది. ఇందులో ఇండియా – ఇరాక్ – ఈజిప్టు – ఇజ్రాయెలు – ఇస్లాంల  అనుబంధం గురించి, ప్రపంచ నాగరికతలు, మత ఆవిర్భావనలు, సాహిత్య ప్రక్రియలు, మెసపొటేమియా, ఈజిప్టు, సింధూ నాగరికతల అవినాభావ సంబంధాలు, సాహిత్యాల సంగమాలు, దేవుళ్ళ సారూప్యతలు, మత గ్రంథాల సారూప్యతలు, మానవజాతి ఆవిర్భావాలు, ఆడ మగ బిడ్డల పుట్టుకలు, ఖగోళ రహస్యాలు, చైనా దేశ నాగరికత, మాయా, అజ్టెక్ నాగరికతలు, సైన్స్ చెప్పే విశ్వ రహస్యాలు మొదలైనవి ఎన్నో విషయాలు అందులో చర్చించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ప్రచురించబడలేదు.

లోగడ ప్రచురించబడ్డ కవితలు, వ్యాసాలు, కథలు నేను పుస్తకాలుగా వేయలేదు. మనసు స్పందించినప్పుడు మాత్రమే వ్రాయటం నాకు హాబీ. ప్రచురితం కాని కవితలు, కథలు ఎక్కడో ఫైళ్ళలో మూలుగుతున్నాయి.

 ప్రత్యేకంగా పురస్కారాలు అంటూ ఏమీ అందుకోలేదు. నేను ఆశించనూ లేదు.

 నా పరిశోధన గ్రంథం “మూడవ కన్ను” ప్రచురించాలనే కోరిక మాత్రం ఉంది. నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవాలనేదే నా ఆకాంక్ష.

 

 ఇతరాలు: విద్యార్థిగా 1969లో తొలి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం ఉంది. కొన్ని వ్యాసాలు, కొన్ని కవితలు అడపా, దడపా కొన్ని పత్రికల్లో ప్రచురించబడుతూ వస్తున్నాయి. నేను రెగ్యులర్ రచయితను కాను. ఏ విషయం పైనైనా నా మనసు స్పందిస్తేనే నేను రాయడం జరుగుతోంది. లేదంటే సైన్స్ కి, మతానికి, చరిత్రకు, మానవ పరిణామ క్రమానికి, కుల మతాల నిర్మూలనకు, పురావస్తు పరిశోధన విషయాలకు, సమసమాజ స్థాపన భావజాలానికి సంబంధించిన పుస్తకాలు చదువుతాను. టీవీ, సెల్ ఫోన్ లో వాటి గురించి వెతికి చూస్తాను. సైన్స్ (విజ్ఞాన శాస్త్రం) అంటే మక్కువ ఎక్కువ. స్వతహాగా నేను హేతుత్వ భావాల అభిమానిని.

 

 ఫోన్:  94918 75179

ఈమెయిల్: adp.rao245 (జిమెయిల్)