Syed Gaffar

స్వపరిచయం:

మా సొంత ఊరు నల్గొండ జిల్లా, దామరచర్ల మండలంలోని వాడపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం – హైద్రాబాద్, హఫీజ్ పేటలో ఆదిత్యా నగర్. అమ్మా నాన్నలు సయ్యద్ అయ్యూబ్ అలి, మాలన్ బి. మేము ఆరుగురము సంతానం. ఇద్దరు అక్కా చెల్లెళ్లు, నలుగురం అన్నాదమ్ములం. నేను నాలుగో వాడిని.

నా పుట్టిన తేదీ: 8-1-1956.

ప్రైమరీ ఎడ్యుకేషన్ దామరచర్లలో, హైస్కూల్ మరియు ఇంటర్ మిర్యాలగూడలో, డిగ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, నల్గొండలో జరిగింది. ప్రభుత్వ సర్వీసులో అవకాశాలు వచ్చినప్పటికీ చేరలేదు.

వివిధ వ్యాపారాల్లో కొనసాగింది జీవితం. ఆ తర్వాత జర్నలిజంలోకొచ్చాను. “పంచాయత్ రాజ్ లీడర్” అనే స్థానిక సంస్థల విశ్లేషణా మాస పత్రికను పెట్టి, వ్యవస్థాపక సంపాదకుడిగా ఎనిమిదేళ్ళు నడపటం జరిగింది.

నాకు నలుగురు కొడుకులు, ఒక అమ్మాయి. వివిధ వృత్తుల్లో సెటిలయ్యారు.

విద్యార్థి దశ నుండే సాహిత్యం చదవటం, కథలు, కవితలు రాయటం మొదలైంది. 1977లో నల్గొండలో ” చైతన్య సమాఖ్య” సాహితీ సంస్థ స్థాపించిన వాళ్ళల్లో నేనూ ఒకడిని. అప్పట్లో మా సభ్యులకు ఎవరికీ ఆర్థిక వనరులు లేకపోవటాన, ఆ సంస్థను చాలా రోజులు నడపలేకపోయాం.

నేను థియేటర్ ఆర్టిస్టును. 1973 నుండి ఓ పదేళ్ళ పాటు నాటకాలు ఆడిన అనుభవం. అప్పట్లో మిర్యాలగూడలో “రసమంజరి” అనే పేరుగల నాటక సమాజం ఉండేది. అందులో నేను ఒక సభ్యుడిని.

రచనల విషయానికొస్తే, గతంలో రాసిన దాదాపు 30 కథలు చిన్న పత్రికల్లో అచ్చయినాయి. రచనా వ్యాసాంగాన్ని నేను సీరియస్ గా తీసుకోని కారణంగా, ఆ కథలు చాల వరకు కన్పించకుండా పోయాయి.

తిరిగి 1996లో ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చిన “పరిష్కారం” అనే కథతో తిరిగి మొదలెట్టిన నా రచన, మళ్ళీ కొద్ది కాలంలోనే ఆగిపోయింది. అలా ఆగి ఆగీ సాగిన నా రచన, తిరిగీ 2019లో ముల్కనూరు ప్రజా గ్రంథాలయం – నమస్తే తెలంగాణ దిన పత్రిక నిర్వహించిన కథల పోటీకి నేను రాసిన ” ఖుర్బాని ” కథకు కన్సొలేషన్ బహుమతి రావటంతో మళ్ళా మొదలైంది. ప్రస్తుతం జీవితంలో కొంచెం తీరుబడి దొరకటంతో రచన వ్యాసంగాన్ని కొనసాగించ గలుగుతున్నా. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం – నమస్తే తెలంగాణ దిన పత్రికవారు నిర్వహిస్తూన్న చరిత్రాత్మక కథల పోటీల్లో నా కథలు వరుసగా 2019లో “ఖుర్బాని”కి (కన్సొలేషన్ ప్రైజ్), 2020లో ” నషా”కు (స్పెషల్ ప్రైజ్), 2021లో “ఉల్టా బాజా”కు ( స్పెషల్ ప్రైజ్), 2022లో “మరో ప్రేమ కావ్యం”కు కన్సొలేషన్ ప్రైజ్ లు రావటం నాకు మధురానుభూతులు కలిగించిన సందర్భాలు.

ఇవికాక, నవ తెలంగాణ వారు 2020లో నిర్వహించిన బండారు అచ్చమాంబ జాతీయ కథా రచన పోటీల్లో నేను రాసిన “హంస” కథ మొదటి బహుమతికి ఎంపిక అయింది.

అలాగే “తెలుగు నాటక కళా సమితి” వైజాగ్ వారు 2020లో నిర్వహించిన కథా నాటక రచన పోటీలో నేను రాసిన “మౌన ధ్వని” నాటిక కన్సొలేషన్ బహుమతి పొందింది.

2017 లో నా కవితా సంపుటి “జనన వాంగ్మూలం” ముద్రితం.

ప్రస్తుతం కథల సంపుటి “ఖుర్బాని”, నాటిక “మౌన ధ్వని” ముద్రణ చివరి దశలో ఉన్నాయి.

 “హంస” కథను నా స్వీయ దర్శకత్వంలో “లఘు చిత్రం” (షార్ట్ ఫిల్మ్)గా తీయటం జరిగింది.