Tirumalasree

స్వపరిచయం:

అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ‘తిరుమలశ్రీ’, ‘విశ్వమోహిని’ కలం పేర్లు. 1946 ఉగాది రోజున భద్రాచలంలో శ్రీమతి మంగారత్నం, సత్యం దంపతులకు జననం. పెరిగింది కాకినాడలో. నాన్నగారు పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేసారు.

విద్యార్హతలు ఎమ్.ఎ. (సోషియాలజీ), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. ప్రాథమిక విద్య కాకినాడలోనూ, ఉన్నత విద్యలు ఇతర రాష్ట్రాలలోనూ సాగాయి. ఆలిండియా సర్వీసెస్ నుండి జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. హైదరాబాదులో స్థిరనివాసం.

వృత్తిపరమైన ఒత్తిడుల నుండి చదవడం, రాయడం గొప్ప రిలీఫ్ ని ఇచ్చేవి.

కేరీర్ అంతా సైన్సు, సైంటిస్టులతో ఇంటరెస్టింగ్ గా, ఛాలెంజింగ్ గా గడచింది. ఉద్యోగరీత్యా పలు రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం, వివిధ ప్రాంతాల సంస్కృతులను, భాషలను తెలుసుకునే అవకాశం దక్కాయి. టాప్ సైంటిస్టులతో పరిచయం, వారితో కలసి పనిచేయడం ఉద్యోగరీత్యా అబ్బిన అదృష్టం.

ముఖ్యంగా దివంగత శ్రీ అబ్దుల్ కలామ్ గారితో కాన్ఫరెన్సులలో, మీటింగ్స్ లో, అఫీషియల్ ఫంక్షన్స్ లో వారితో వేదికను పంచుకోవడం, ప్రివిలేజ్డ్ లంచియన్ మీటింగ్స్ లో పాల్గొనడం వగైరాలు మరువలేని స్మృతులు. ప్రభుత్వానికి సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉన్న రోజులలో అయిన పరిచయం, దేశాధ్యక్షులు అయ్యాక కూడా కొనసాగడం ముదావహం. అలాగే, మాజీ అధ్యక్షులు శ్రీ కె.ఆర్. నారాయణన్ తో పరిచయం కూడా మరువలేనిది.

ఇక సాహితీ ప్రస్థానానికి వస్తే… చదవడం, రాయడం చిన్ననాటనే అబ్బిన ‘వ్యసనాలు’. సాయంత్రం స్కూలు బెల్ కొట్టగానే అంతా ప్లేగ్రౌండ్ కి పరుగెడితే, నేను మాత్రం స్కూలు ఎదుట ఉన్న జిల్లా గ్రంథాలయానికి దారి తీసేవాణ్ణి. రాత్రి 8 గంటలకు లైబ్రరీ క్లోజ్ చేసినప్పుడు కానీ, బైటపడేవాణ్ణి కాదు. కనిపించిన పుస్తకమల్లా ఆబగా చదివేసేవాణ్ణి. నా దృష్టిలో మంచి రచన, చెడ్డ రచన అనేవి ఉండవు. ప్రతి రచనలోనూ పాఠకుడు నేర్చుకోవలసిన అంశం ఏదో ఒకటి ఉంటుంది అన్నది నా నమ్మకం. అందుకే అక్షరం ఎక్కడ కనిపించినా చదవాలన్న అభిలాష.

ఆ పఠనాభిలాషే నన్ను రచయితగా మలచి 12వ ఏటను నా మొదటి కథా (‘టోకరా’, చిత్రగుప్త పక్షపత్రిక, మద్రాసు, 1958), 15వ ఏటను నా మొదటి నవలా (‘పునర్జన్మ’, భాగ్యశ్రీ పబ్లికేషన్స్, మద్రాసు, 1961) ప్రచురించేటట్టు చేసింది.

తెలుగులో – అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాలసాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. కొన్ని కవితలు, కార్టూన్లూ ప్రచురితమయ్యాయి.

చిత్రలేఖనంలో (ఫ్రీ స్కెచ్, ఆయిల్ పెయింటింగ్, వగైరా) కొంతవరకు పట్టు సాధించినా, సమయాభావం వల్ల కాలక్రమాన ఆ హాబీని వదులుకోక తప్పలేదు.

సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో అందుకున్న బహుమతులు, సన్మానాలు, సత్కారాలు ఎన్నో! కొన్ని

కథలు ఆంగ్లం, హిందీ, ఒరియాతో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. మద్రాసు నుంచి వెలువడిన యువరాణి మాసపత్రికలో ‘మహాత్ముడు పుట్టిన దేశంలో మహిషాసురులు’ అనే ఓ పాప్యులర్ లిటరరీ కాలమ్, మరియు ‘ప్రశ్నోత్తరాల’ కాలమ్ ఏకకాలంలో నిర్వహించారు. ఎడిటింగులో కూడా అనుభవం సంతరించుకున్నారు.

పుస్తకరూపంలోను, పత్రికలలోను, సీరియల్స్ గానూ 200 నవలలు ప్రచురితమయ్యాయి. 2022 సం. లో ‘ప్రతిలిపి’ వారు నిర్వహించిన జాతీయ నవలల పోటీ (సూపర్ రైటర్స్ అవార్డ్స్-3) లో నా నవల ‘ప్రేమసంతకం’ కి తృతీయ బహుమతి లభించింది. ప్రస్తుతం మరో 3 నవలలు ప్రచురణకు సిద్ధంగా వున్నాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయి. నాటికలు, నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శించడమే కాక వాటిలో నటిస్తూ, దర్శకత్వం వహించడం కూడా కద్దు.

ఆలిండియా రేడియో, మద్రాసు నుండి పలు కథలు, నాటికలు, నాటకాలూ ప్రసారం అయ్యాయి. స్వంత స్క్రిప్ట్ తో కార్మికుల కార్యక్రమం, బాలల వీక్లీ ప్రోగ్రామ్స్ ని నిర్వహించే అవకాశం కూడా లభించింది. రేడియోలో నా తొలి ప్రోగ్రామ్ చేసింది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారయితే, ఆ తరువాత ప్రోత్సహించినది మద్రాసు స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఎస్. వేణుగోపాల రెడ్డి గారు. నేను దేశంలో ఎక్కడ ఉన్నా నా రచనలు మద్రాసు స్టేషన్ నుంచే ప్రసారం చేసేలా ఢిల్లీ నుండి ప్రత్యేక అనుమతిని పొందారు ఆయన.

ఆలిండియా రేడియో, మద్రాసు ‘బి’ స్టేషన్ నుంచి తెలుగు ప్రోగ్రామ్స్ ప్రసారమవుతుండేవి. ఆ విభాగానికి ఓ అడ్వైజరీ కమిటీ ఉండేది. పింగళి నాగేంద్రరావు, కె. రామలక్ష్మి వంటి లబ్ధ ప్రతిష్ఠులైన సీనియర్ రైటర్స్ వున్న ఆ కమిటీలో ఎర్లీ ట్వెంటీస్ లో ఉన్న నాకూ స్థానం లభించడం ఓ అపూర్వ అనుభవం. నేను మద్రాసు నుండి ఉత్తరాదికి బదిలీలో వెళ్ళేంతవరకు ఆ సభ్యత్వం కొనసాగింది.

నా ఫస్ట్ పోస్టింగ్ మద్రాసులో కావడం పబ్లిషర్స్ తో సాన్నిహిత్యాన్ని కలిగించింది. నా రచనలను రెగ్యులర్ గా ప్రచురిస్తూ నా సుదీర్ఘ సాహితీప్రస్థానంలో ప్రోత్సహించిన పబ్లిషర్సూ, ప్రముఖ పత్రికా సంపాదకులూ ఎందరో! వారందరికీ ఎంతో రుణపడివున్నానని చెప్పకతప్పదు.

‘కలహంస’’ పురస్కారం అందుకోవడం, ‘కథాకిరీటి’, ‘కథా విశారద’, ‘బాలకథాబంధు’ బిరుదులు పొందడం ముదావహం. స్టోరీమిర్రర్ (మల్టీ-లింగ్యువల్ పోర్టల్) యొక్క ‘లిటరరీ కల్నల్’’ మరియు ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదులు కూడా లభించాయి. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్ – 2019’ నామినీ. ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్ – 2020’ (1st రన్నరప్- రీడర్స్ ఛాయిస్), మరియు (2nd రన్నరప్-ఎడిటర్స్ ఛాయిస్) టైటిల్స్ అండ్ ట్రోఫీస్ ని గెలుచుకున్నారు. ‘ఆథర్ ఆఫ్ ద మంత్’ (సెప్టెంబర్ 2020) టైటిల్, బహుమతి కూడా లభించాయి.

తిరుపతిలో ఒకరు తెలుగు కథల పైన డాక్టరేట్ చేస్తూ, వాటిలో నా కథలను కూడా చేర్చడం సంతోషదాయకం. ‘చందమామ’ పత్రిక 2011 సెప్టెంబరు సంచికలో ప్రచురింపబడ్డ నా బాలల కథ “పసిపాప నేర్పిన పాఠం” మహరాష్ట్ర ప్రభుత్వం మరాఠీలో పాఠ్యాంశంగా చేర్చడం మరో విశేషం.

ఇకపోతే, ఆంగ్లంలో – కథలు, ఆర్టికిల్స్ వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘కేరవన్’, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’, ‘ఆడమ్ అండ్ ఈవ్’, ‘సాజిత్’, ‘చందమామ’ (ఆంగ్లం), చంపక్, గోకుల్ మున్నగు ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. వాటిలో ‘డెక్కన్ క్రానికల్’ డెయిలీ లో ప్రచురితమైనవాటిలో ఒకదానికి లభించిన ‘మిడిల్ ఆఫ్ ద వీక్’ బహుమతి ఒకటి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వీక్లీ (లిటరరీ) కాలమ్ కి చాలా వారాలు రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి.

హిందీలో – అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియో (ఝార్ఖండ్) లో ప్రసారితమయింది.

సాహితీ సభలకు, సమావేశాలకూ దూరం. అలాగే సామాజిక మాధ్యమాలకు కూడా. సమయాభావం ఒక కారణం అయితే, ఆ సమయాన్ని చదవడానికో, రాయడానికో ఉపయోగించుకోవచ్చునన్న అత్యాశ కూడా మరో కారణం!

నా సాహితీ ప్రయాణం నిరాటంకంగా కొనసాగినా, కేరీర్ లో అత్యల్పకాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోగలిగినా దాని వెనుక వున్న వ్యక్తి, శక్తి నా శ్రీమతి సీతారామలక్ష్మి. ఎ ట్రెడిషనల్ హౌస్ వైఫ్. ఆమె ప్రోత్సాహము, సహకారమూ ఎనలేనివి. (2022లో క్రితం ఓ రాత్రివేళ మమ్మల్ని షాక్ కి గురిచేస్తూ ‘సైలెంట్ స్ట్రోక్’ తో హఠాత్తుగా నిష్మ్రమించింది).

చుట్టూ వున్న సమాజమే నా రచనలకు ప్రేరణ. నా డెస్క్ దగ్గర కూర్చుని క్వయెట్ గా రాసుకోవడం నాకిష్టం. అనవసరపు పబ్లిసిటీకి దూరం. సింపుల్ గా ఉండడం ఇష్టం. బాగున్న ప్రతి రచనా నాకు స్ఫూర్తిదాయకమే. ‘రచయిత’ కాక, ‘రచన’ పాఠకుల గుర్తింపు పొందాలి అన్నది నా సిద్ధాంతం. తన రచనలకు దక్కే పాఠకుల ఆదరణ, అభిమానమూ రచయితకు ఊపిరి, ఉత్సాహమూను. అసంఖ్యాక అభిమానుల కోసమైనా రాయాలనిపిస్తుంది. చివరివరకూ రాస్తూనే వుండాలన్న తపన.

కళ ఏ రూపంలో ఉన్నా మిక్కిలి ఇష్టం. సంగీతమంటే ప్రాణం. రోజుకి కొన్ని పేజీలయినా చదవడం, రాయడం ఏళ్ళుగా అలవడ్డ అలవాటు.

(పత్రికలలో వ్యాపారధోరణలు కనిపిస్తూన్న ఈ రోజుల్లో, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సాహితీ విలువలకు పెద్దపీట వేయడం, నూతన రచయితలను ప్రోత్సహించడం మిక్కిలి ముదావహం, శ్లాఘనీయం. ఇలాంటి సంస్థల వల్ల ఉత్తమసాహిత్యానికి గుర్తింపు లభించడమే కాక, చిరకాలం నిలుస్తుందన్న ఆశాభావం కలుగకమానదు. అందుకు అంకితభావంతో పనిచేస్తూన్న నిర్వాహకులను ఎంత అభినందించినా తీరదు.)

కథానిలయంలో తిరుమలశ్రీ రచనలు