LLM, MBA చదువుకున్న వేముల శ్రీనివాసులు గారు రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖలో జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ముల్కనూరు గ్రామంలో కొంతమంది మిత్రులతో కలిసి ముల్కనూరు ప్రజా గ్రంథాలయాన్ని స్థాపించి విద్యార్థులకు, సాహిత్య రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.
తెలుగు కథను ప్రోత్సహించే ఉద్దేశంతో నమస్తే తెలంగాణ దినపత్రికతో కలిసి 2019 నుంచి ప్రతి యేటా జాతీయ స్థాయిలో తెలుగు కథల పోటీ నిర్వహించి, బహుమతిగా 6 లక్షల రూపాయలను అందజేస్తున్నారు. బహుమతి పొందిన కథలతో ప్రతి సంవత్సరం కథాసంపుటిని వెలువరిస్తున్నారు.
గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య స్మృత్యర్థం తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందిస్తున్న కీర్తి పురస్కారం 2021 సంవత్సరానికి వేముల శ్రీనివాసులు గారు అందుకున్నారు.