Venu-Mareedu

సంక్షిప్తంగా:

వేణు మరీదు స్వస్థలం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర గ్రామం. ప్రస్తుతం ఖమ్మంలోని బాలికల కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

చిన్న వయసులోనే బోధనారంగంలోకి ప్రవేశించారు. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థుల జీవితాలను ఎంతో ప్రేమతో, సునిశితంగా పరిశీలించడం వల్లే తనకు రచనా శక్తి అబ్బిందని వేణు మరీదు అభిప్రాయం.

కాస్త ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించిన వేణు మరీదు, ఇప్పటికి 19 కథలు రాశారు. వాటిలో కాటుక కన్నుల సాక్షిగా, ది టాయిలెట్‌ గర్ల్‌, నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి!, అచ్చమ్మవ్వ ఆరో నాణెం, ప్రెజెంటెడ్‌ బై వసుధ, అవ్వా బువ్వ పెట్టవే!, ఆ నలుగురు లేని నాడు కథలు పాఠకుల మన్ననలు పొందాయి.

సవివరంగా:

“ఏ ఒక్కరి మేఘంలోనైనా నువ్వు ఓ ఇంద్రధనస్సువై విరియాలి…” అని ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి, ఉద్యమకర్త అయిన మయా ఏంజెలూ అన్న మాటను దృఢంగా నమ్మే అధ్యాపకుడు వేణు మరీదు. 

చిన్న వయసులోనే బోధనలోకి ప్రవేశించిన ఈయన పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థుల జీవితాలను ఎంతో ప్రేమతో సునిశితంగా పరిశీలించడం వల్లనే తనకు రచనలు చేయగలిగే శక్తి అబ్బిందని చెబుతున్నారు.

తనకు రచన కన్నా బోధన అమిత ఇష్టమని, ప్రభుత్వ కళాశాలల్లో గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాష బోధించటం క్లిష్టమైనా కూడా దానినే ఇష్టంగా చేసుకున్నానని వేణు చెపుతున్నారు.

ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించిన ఈ రచయిత ఇప్పటికి 19 కథలు రాశారు. వాటిల్లో నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం వారి 2021 కథల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన’ కాటుక కన్నుల సాక్షిగా…’, ముళ్ళ చినుకులు సంకలనంలోని ‘ది టాయిలెట్ గర్ల్’, వెలుగు పత్రికలో వచ్చిన ‘నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి!’, వార్త పత్రికలో వచ్చిన ‘అచ్చమ్మవ్వ ఆరో నాణెం’, సాహితీ ప్రస్థానంలో వచ్చిన ‘ప్రెజెంటెడ్ బై వసుధ’, జాగృతిలో అచ్చయిన ‘అవ్వా బువ్వ పెట్టవే!’, సాహితీ ప్రస్థానంలో వచ్చిన ‘ఆ నలుగురు లేని నాడు’ కథలు మంచిపేరు తెచ్చి పెట్టాయి.

ఖమ్మం జిల్లా నుండి వచ్చిన రచయితలు చాలా తక్కువగానే తెలంగాణ మాండలికంలో రాస్తున్నారని, తాను “అతని నుండి ఆమె దాకా….” కథను తెలంగాణ మాండలికంలో రాయటానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చెప్తున్నారు.

తెలుగులో కథలు రాయటంతో పాటు ఆల్ పోయెట్రీ డాట్ కామ్ వంటి వెబ్ సైట్లలో ఆంగ్ల కవిత్వాన్ని రాస్తున్నారు వేణు మరీదు.

రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన కథల పోటీలలో ఈ రచయిత ఎన్నో బహుమతులు పొందారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం వారు నిర్వహిస్తున్న కథల పోటీల వల్ల తెలుగు సాహిత్యంలో విభిన్న ఇతివృత్తాలు కలిగిన కథలు పాఠక లోకానికి పరిచయం అవ్వటం చాలా సంతోషం అని వీరు అభిప్రాయ పడ్డారు. 1996 నుండి బోధనా రంగంలో ఉన్న వీరు ప్రస్తుతం ఖమ్మంలోని బాలికల కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

రచయిత పేరు: వేణు మరీదు

తల్లిదండ్రులు: రాధ, రుక్మాంగధ

జన్మస్థలం: వంగా ముత్యాల బంజరు గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ

జననం: 23 ఆగస్ట్ 1970

రచనలు:

 1. ఆ నలుగురు లేనినాడు…
 2. బామ్మ
 3. నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి!
 4. కాటుక కన్నుల సాక్షిగా
 5. అవ్వా బువ్వ పెట్టవే…
 6. ఒక రిప్ తో సరి
 7. అతడి నుండి ఆమె దాకా…
 8. ఇది ఏం బ్రీడు?
 9. డెడ్ ఎండ్
 10. తప్పిపోని గొర్రెల కథ…
 11. అసతోమా సద్గమయ
 12. హృదయమే మధురమైన వేళ
 13. ఎవరిది?
 14. డాం డూమ్ డుస్క్…
 15. అసూయకు ఆవలి తీరంలో
 16. ఒకే ఒక్క పాఠం…
 17. విశ్వమంతా విరాజిల్లు
 18. ప్రెజెంటెడ్ బై వసుధ
 19. ది టాయిలెట్ గర్ల్…

 

వేణు మరీదు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు:

VENU MAREEDU

 

వీరు రాసిన ఆంగ్ల కవిత్వాన్ని allpoetry.com వెబ్సైటులో చదవవచ్చును:

Venu – poet at allpoetry