vivek-lankamala

స్వపరిచయం:

వివేక్ లంకమల స్వపరిచయం: నా పూర్తి పేరు వివేకానంద రెడ్డి లోమాటి. తల్లిదండ్రులు సత్యనారాయణమ్మ, బాలవీరారెడ్డి. ఊరు వైయస్సార్ కడప జిల్లా బద్వేలు తాలూకా నందిపల్లె. చదువు ఇంజనీరింగ్, వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రవృత్తి పుస్తకాలు, సినిమాలు, సమాజం, రాజకీయాలు, కొండ కోనలు, అడవులు, జలపాతాలు, రాయలసీమ పల్లెల్లో మనవంటూ కొన్ని కబుర్లు.

 

ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగ అన్వేషణలో ఉన్న సమయంలో తెలుగు నవలలు చదవడం అయింది. ఆ తర్వాత సాహిత్యం వ్యసనం అయింది. ఫేస్బుక్ వేదికగా నాలుగేళ్లుగా కథలు రాస్తున్నాను. అలా 2020 లో కడప యాసలో నేను రాసిన ‘మల్లిగాని బత్తెం’ అనే కథ 2021 లో అరణ్యవాసం సినిమాగా వచ్చింది. కథలో రాసిన మా బద్వేల్, లంకమల ప్రాంతాల్లోనే షూటింగ్ కూడా జరిగింది. పొట్టేలు, నెత్తర పొడి (నవలికలు), కొండకట్టెలు, యామయ్య గుర్రం, మున్రెడ్డి ముసిలెద్దు (కథలు), మొదలైన రచనలు ఆ వరసలో రాసినవే.

 

శ్రీ సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీ- 2021 లో ‘కరువు సీమ’ కథకు ద్వితీయ బహుమతి, నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీ – 2021 లో ‘నాటు పడింది’ కథకు ప్రోత్సాహక బహుమతి వచ్చినాయి.

 

కరోనా సమయంలో సరదాగా మొదలైన లంకమల ప్రయాణాలు అడివిని, ప్రకృతిని పరిచయం చేస్తే నల్లమల, పాలకొండలు, వెలిగొండలు, సోమశిల, నదులు, సంగమాలు అంటూ ప్రయాణాలు జీవితంలో భాగమైనాయి. వాటన్నింటిని త్వరలో ‘లంకమల దారుల్లో’ పుస్తకంగా తీసుకురాబోతున్నాను.

‘అడుగంటూ బయటపెడితే గమ్యమే చేరాలని లేదు, ఆ ప్రయాణంలో ఎక్కడో చోట నీకు నువ్వు దొరక్కపోవు’ అని నమ్ముతాను.